మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం
ఫిరంగిపురం: బాల ఏసుకు జన్మనిచ్చిన మరియ మాత తన పుత్రుడిపై చూపే ప్రేమను గుర్తుకు తెచ్చే మహిమాన్విత పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాలఏసు దేవాలయం. ఎత్తయిన గోపురంతో ఎలాంటి ఆధారం లేకుండా లండన్ మిల్‌హిల్‌కు చెందిన విచారణ గురువు ఫాదర్ డిక్మన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. అందుకే రాష్ట్రంలోనే ఎత్తయిన బాల ఏసు కథెడ్రల్ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు ప్రాంతాల నుంచి మత గురువులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
క్రిస్మస్ సందర్భంగా ఈనెల 23, 24, 25 తేదీల్లో క్రీస్తు జయంతి మహోత్సవాలు నిర్వహించనున్న ట్లు విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. ఈ ఆలయానికి విచారణ గురువులుగా వచ్చిన అనేక మంది ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులలో భాగంగా వ్యాకుల మాత విగ్రహం, బెల్ టవర్, పునీత గురువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు.
ఆలయ చరిత్ర ఇదీ...
18 శతాబ్దంలో కథోళిక సంఘం ఫిరంగిపురంలో ఏర్పాటు చేశారు. కొండమెట్లకు వెళ్లే దారిలో చిన్న ఆలయం ఉండేది. దానికి విచారణ గురువులుగా లండన్ మిల్‌హిల్‌కు చెందిన థియోడర్ డిక్మన్ వచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆయన బాధపడ్డారు. 1888లో ఆలయ పునర్నిర్మాణానికి తన సొంత నిధులను వెచ్చించి శంకుస్థాపన చేశారు. 1891 నాటికి అద్భుతంగా బాల ఏసు దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయం పూర్తిగా ఫ్రెంచి నిర్మాణ శైలిలో ఉండటం విశేషం. ఆలయం పైభాగంలో ఉన్న డోమ్‌కు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా దీనిని నిర్మించారు.
పండుగకు సర్వం సిద్ధం
క్రిస్మ్‌స్ సందర్భంగా 15వ తేదీ నుంచే ఆలయంలో నవ దిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 23న సహాయ విచారణ గురువు కె.సాగర్ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. 24న బాల ఏసు దేవాలయ విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి మహోత్సవాలు, దివ్యపూజాబలి ఉంటాయి. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దివ్యపూజాబలి నిర్వహిస్తారు. 25న విచారణ క్రైస్తవుల ఆత్మ శరీర మేలు కోసం దివ్యపూజాబలి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన యాజకులుగా ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్‌లు వ్యవహరిస్తారు. రాత్రి బాల ఏసు కథెడ్రల్ దేవాలయ రథోత్సవం (తేరు ప్రదక్షిణ) నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలలో మఠకన్యలు, గుడి పెద్దలు, సోడాలిటీ సభ్యులు, మరియ దళ సభ్యులు, కథోళిక సంఘ సభ్యులు కీలక భూమిక పోషిస్తారని చెప్పారు.
మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం
మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం


