నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
ప్రత్తిపాడు: నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి అన్నారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో గురువారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, సాగు చేయవద్దని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 740 జారీ చేసిందని, అతిక్రమించి సాగు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ టీంలు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది నల్లబర్లీ సాగు చేయవద్దంటూ అవగాహన కల్పిస్తున్నా, కొందరు రైతులు వినడం లేదన్నారు. అందుకే గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ టీంకు పంపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆమె వెంట మార్క్‌ఫెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్‌రావు, తహసీల్దార్ ఉన్నారు.
మాచర్ల: మాచర్ల బస్టాండ్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. పాత మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కొండవీటి రాఘవాచార్యులు, అధ్యక్షులు భవనాశి వెంకటేశ్వర్లు, పట్టణంలోని ప్రధాన వీధిలోని కోదండ రామాలయంలో అర్చకులు కొండవీటి వేణుగోపాలాచార్యులు, అధ్యక్షులు బచ్చు రామారావులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.
అమృతలూరు(భట్టిప్రోలు):గోవాడలోని గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కోటి కుంకుమార్చన, సామూహిక లలితా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఎస్‌ఎస్‌ఎఫ్ బాపట్ల దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు, ఎక్స్‌అఫిషియో సభ్యులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉపముఖ్య అర్చకులు చావలి శ్రీధరశర్మ, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. అన్నదానం కూడా చేస్తున్నట్టు వివరించారు.
తాడికొండ: మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2025 నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. ఆనంద్ ఈ చెస్ వింగ్స్, ఏపీసీఏ విభాగం, గుంటూరు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల నుంచి ఏ వయసు వారైనా పాల్గొనవచ్చన్నారు. ఎంట్రీ ఫీజు రూ.500 అని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు, భోజన వసతి ఉంటుందన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నల్లాని వెంకట రామారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు


