రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఒక వాహనం ఢీకొనగా జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటన ప్రాంతంలోనే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అందిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని ఒక వాహనం ఆ మార్గంలో వస్తూ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆగ్రహానికి లోనై మరణించిన వ్యక్తి శవాన్ని రోడ్డుపై ఉంచి 26 వ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. టైర్లు కాల్చి ఆందోళన జరిపారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందిన జయపురం సదర్‌ పోలీసు అధికారులు సిబ్బంది, సంఘటన ప్రాంతానికి చేరుకొని అది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని, అర్థం చేసుకుని రాస్తారోకో విరమించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని, పరిహారం అందేటట్టు ప్రయత్నిస్థామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.

Advertisement
 
Advertisement
Advertisement