ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్‌ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్‌ వార్షికోత్సవం

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

మల్కనగిరి: పట్టణంలోని శ్రీరామనగర్‌లోఉన్న సరస్వతి శిశుమందిర్‌ వార్షికోత్సవాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌ మహారాణ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సమారీ తాంగులు ముఖ్యఅతిథిగా, జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్‌ పాణిగ్రహి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు నీలమణి ప్రధాన్‌ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఘడాయి కాలేజీ నిర్వహణ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ చంద్ర ఘడాయి, విద్యుత్‌ శాఖ కార్యనిర్వాహక అధికారి ఆశీస్‌ కుమార్‌ జెన, విద్యా వికాస సమితి దక్షిణ విభాగ పరిశీలకుడు సుకాంత్‌ కుమార్‌ బెహర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో అతథులను సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం భారత మాతకు దీప ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంతో సభను ప్రారంభించారు. పదో తరగతి విద్యార్థినులు ప్రారంభ గీతాన్ని ఆలపించారు. పాఠశాల ప్రధానాచార్యులు సరోజ్‌ కుమార్‌ సామల్‌ అతిథులను పరిచయం చేసి స్వాగత ప్రసంగం చేశారు. నిర్వాహణ కమిటీ కార్యదర్శి రమేష్‌ చంద్రరావత్‌ పాఠశాల వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉత్తమంగా స్థిరపడాలంటే చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, సద్గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలు, విద్య, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిథి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పాఠశాల శ్రేయోభిలాషులు బనమాలి పాత్రొ, విప్రమండల్‌ను సత్కరించారు.

శ్రీశయన కులస్తులకు

ఎమ్మెల్సీ ఇవ్వాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీశయన కులస్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నూతన కార్యవర్గ నాయకులు కోరారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శ్రీశయన సంఘ, జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కోల బలరాం, ప్రధాన కార్యదర్శిగా గురు జగదీష్‌, కోశాధికారిగా బమ్మిడి రమణ, సంఘ జిల్లా అధ్యక్షుడిగా కై బాడి రాజు, ప్రధాన కార్యదర్శిగా దండాసి జ్యోతి భాస్కర్‌, కోశాధికారిగా బంటుపల్లి కోటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు డీపీ దేవ్‌, కేంద్ర సంఘ అధ్యక్షుడు వంగా మహేష్‌దేవ్‌, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కోల బలరాం తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలోని కల్లుగీత కార్మికులకు తాటిచెట్లు పెంచుకోవడానికి అసైన్డ్‌ ల్యాండ్‌ ఇవ్వాలని కోరారు. శ్రీశయన కులస్తులను ఎంబీసీ మోస్ట్‌ బ్యాక్వార్డ్‌ క్లాస్‌ జాబితాలో చేర్చాలని, ప్రతి జిల్లాలో ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థలాలు మంజూరు చేయాలన్నారు. శ్రీశయన కార్పొరేషన్‌ సభ్యుల నియామకం ప్రభుత్వం వెంటనే జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పూర్వపు అధ్యక్షులు మెండలాల్‌ బహదూర్‌ శాస్త్రి, మండల మన్మథరావు, గుజ్జల శాంతిశ్వరరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాణాల కృష్ణారావు, విశాఖపట్నం అధ్యక్షుడు పెంట వెంకట్రావు, తోట వాసుదేవరావు, కేంద్ర శ్రీశయన సంఘ గౌరవ అధ్యక్షుడు దేవాడ మోహనరావు, కార్యదర్శి బైరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి

బూర్జ: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన చుక్కర తౌవుడు(70) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చుక్కర తౌవుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని, రెండు ఎకరాల్లో వరిపంట, మరో రెండు ఎకరాల్లో అరటి పంటలు వేశాడు. ఇటీవల వడగండ్లతో ఆకాల వర్షం పడడంతో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. వరిపంటకు కూడా తీవ్రనష్టం జరిగింది. దీంతో అప్పులు పాలయ్యానని మనస్థాపం చెందాడు. ఈనెల 10వ తేదీన ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. సాగు చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా అతడు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య చుక్కర లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.ప్రవల్లిక తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement