ఎలుగు దాడిలో వృద్ధునికి గాయాలు
రాయగడ: ఎలుగుబంటి దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు గురైన వ్యక్తి కందురు ప్రస్కాగా గుర్తించారు. ఈ ఘటన కొలనార సమితి పాయికోపొడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడిన కందురు ప్రస్కాను చికిత్స కోసం స్థానిక క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించారు. తన సొంత పొలానికి వెళుతున్న సమయంలో సమీప అడవుల నుంచి రెండు ఎలుగులు వచ్చి ఆకస్మికంగా అతనిపై దాడి చేశాయి. దాడిలో కందురుకు తల, చేతులకు గాయాలయ్యాయి.
అగ్నివీర్‌కు ఎన్‌సీసీ క్యాడెట్లు
● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్‌తో పాటు అనేకమంది ఎన్‌సీసీ–బీ సర్టిఫి కెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శైలజకు అవార్డు
శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర సైనిక డిపార్ట్‌మెంట్ వెల్ఫేర్ తరపున లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆదిభట్ల శైలజ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుపై జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మాజీ సైనికులు, సైనిక వితంతువులకు ఆమె చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్‌గా సేవలు అందిస్తున్న బైరి మురళీ కూడా అవార్డు అందుకున్నారు. అలాగే ఇటీవల వీర మరణం పొందిన బైరి గ్రామానికి చెందిన జవాన్ వెంపటాపు రాజు భార్య రూ.50,000ల చెక్కు అందుకున్నారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర సైనిక డిపార్ట్‌మెంట్ సంచాలకుడు విశ్రాంత బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈక్యూ ఫర్ పీస్‌తో బీఆర్‌ఏయూ ఎంవోయూ
ఎచ్చెర్ల: ఆన్‌లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్‌ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్‌లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు.
మహిళ అదృశ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్‌కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎలుగు దాడిలో వృద్ధునికి గాయాలు


