విజిలెన్స్ వలలో దశమంత్‌పూర్ ఐఐసీ
కొరాపుట్: విజిలెన్స్ వలలో దశమంతపూర్ సమితి కేంద్ర పోలీస్ స్టేషన్ ఐఐసి సుక్ము హన్సద చిక్కుకున్నారు. గురువారం కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ పోలీస్ స్టేషన్ పై విజిలెన్స్ ట్రాప్ చేసి హన్సదని అరెస్ట్ చేశారు. స్టేషన్‌లో ఒక కేసు విషయం పై నిందితుడికి బెయిల్ రాలేదు. స్టేషన్ నుంచి కేసు డైరీ రానందున కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో నిందితుడి బంధువులు కేసు డైరీని కోర్టుకి పంపాలని ఐఐసీని విజ్ఞప్తి చేశారు. కేసు డైరీ పంపడానికి ఆమె రు.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో నిందితుడి బంధువులు విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు. వారు పౌడర్ పూసిన నగదుని విజిలెన్స్ వారు నిందితుడి బంధువులకు అందించారు. ఆ నగదు స్టేషన్‌లో నిందితుడి బంధువులు ఐఐసీకి అందించగానే విజిలెన్స్ వారు మెరుపు వేగం తో స్టేషన్ లోనికి చొరబడి ఆమెను పట్టుకున్నారు. వెను వెంటనే స్టేషన్ తలుపులు మూసి వేసి సోదాలు ప్రారంభించారు. ఆమెకు సంబందించి రెండు చోట్ల స్థిరాస్తులపై విజిలెన్స్ విభాగం దాడులు ప్రారంబించింది. ఈ ఘటన జరిగిన వెంటనే దశమంత్‌పూర్ వాసులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో అక్రమ మద్యం పై తాము ఫిర్యాదులు చేస్తే ఐఐసి తమనే బెదిరించేవారన్నారు. అంతే కాక అక్రమ మద్యం ఉత్పత్తి దారుల వద్ద నెలకు రూ.30 వేలు లంచం తీసుకుంటున్నట్లు ఆమే స్వయంగా చెబుతూ బెదిరించే వారని తెలిపారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మీద హన్సద ని కొరాపుట్ తరలించారు. పోలీసు ఉన్నతాధికారి స్థాయిలో వ్యక్తిని విజిలెన్స్ అరెస్ట్ చేయడం తో పోలీసు వర్గాలు ఉలిక్కి పడ్డాయి.


