విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రాయగడ: స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరీనగర్‌లోని బాల్వాడి పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు జరిగాయి. తెలుగు, ఒడియా విద్యార్థుల మధ్య వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆరోగ్యవంతమైన జీవితానికి నవ్వు ఔషధం అనే అంశంపై పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన నెలవారీ సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి మాట్లాడుతూ.. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రతీఒక్కరూ నవ్వును అలవాటు చేసుకోవాలని సూచించారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే వ్యాయామం, ప్రాణాయం ఎంత అవసరమో నవ్వు కూడా అంతే అవసరమని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు తమ స్నేహితులతో కలసి కొంత సేపు నవ్వుతూ రోజులు గడపాలని సూచించారు. నవ్వును మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని అన్నారు. తమ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి చర్చించారు. వ్యాసరచన పోటీల్లొ గెలుపొందిన విద్యార్థులకు క్లబ్ సభ్యులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యవతి, కోఆర్డినేటర్ అభిమన్యు నాయక్, టి.జయరాం, దాశరథి రాజ్‌గురు, లాల్‌బిహారి లెంక, సలహాదారుడు ఉదయ్ చంద్ర పండ, కోశాధికారి గుడ్ల వెంకటరమణ, ఆర్తాత్రాణ్ మహాంతి, విద్యాలయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


