క్వారీలో పేలుళ్లు
● పక్కనే వ్యవసాయ పనుల్లో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలు
కొత్తూరు: శోభనాపురం కొండపై నిర్వహిస్తున్న క్వారీలో పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరిపడటంతో పక్కనే తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళా కూలీలు గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..శోభనాపురం గ్రామానికి చెందిన బైరి భానుమతి, రామలక్ష్మి, పుష్పలు క్వారీకు ఆనుకొని ఉన్న మామిడితోటలో పసుపు పంటను తవ్వేందుకు వెళ్లారు. పసుపు తవ్వుతుండగా ఒక్కసారి క్వారీ నుంచి భారీ శబ్దాలు వెలువడటంతో భానుమతి, రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి గాయాలు కనిపించడంతో పుష్ప కేకలు పెట్టడంతో వెంటనే సమీప వరి పొలాల్లో పనులు చేస్తున్న వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పేలుళ్లు చేస్తుండటం వల్లే తమకు గాయాలు తగిలాయని బాధితురాలు భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భానుమతి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న అనంతరం జీడీ నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు.


