విజ్ఞాన ప్రదర్శనలో సెంచూరియన్ ప్రతిభ
రాయగడ: విద్యార్థుల్లో ప్రతిభను కనబరిచేందుకు విజ్ఞాన ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ అన్నారు. స్థానిక మహిళా కళాశాలలో యువజనోత్సవాల పేరిట ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యువజనోత్సవాల పేరిట వివిధ పొటీలను నిర్వహిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లా నుంచి వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పితామహల్‌లో గల సెంచురియన్ విశ్వవిద్యాలయానికి చెందిన 12 వ తరగతి విద్యార్థుల బృందానికి ప్రథమ బహుమతి లభించింది. సీనియర్ విభాగంలో గెలుపొందిన సెంచూరియన్ విద్యార్థులు ప్రథమ బహుమతితో పాటు పది వేల నగదు బహుమతిని సంపాదించుకున్నారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో మూడోస్థానం కూడా సంపాదించారు.
విజ్ఞాన ప్రదర్శనలో సెంచూరియన్ ప్రతిభ


