 
															గుండిచా ఆలయం..ఇక నిత్య దర్శనం..!
● సన్నాహాలు చేస్తున్న అధికారులు 
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని సంస్కృతిలో గుండిచా మందిరం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ప్రధానంగా స్వామివారి వార్షిక నవ దినాత్మక రథయాత్ర పురస్కరించుకుని ఈ మందిరం పండగ శోభని సంతరించుకుంటుంది. రథయాత్రలో భాగంగా ఈ మందిరం అడపా మండపంపై సోదర సోదరీ సమేతంగా జగన్నాథుడు, సుదర్శనుడు మరియు ఉత్సవమూర్తులు కొలువుదీరి మారు రథయాత్ర వరకు నిరవధికంగా దర్శనం కల్పిస్తారు. ఈ వ్యవధిలో అడపా మండపంపై మూల విరాటుల దర్శనం కోటి జన్మల పుణ్యఫలం ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాడ నమ్మకం. తదుపరి కాలంలో ఏడాది పొడవునా మూతబడి ఉంటుంది. ఈ లెక్కన రథయాత్ర మినహా ఇతర రోజుల్లో శ్రీక్షేత్రం సందర్శించే భక్తులు, యాత్రికులకు గుండిచా మందిరంలోనికి ప్రవేశించే అవకాశం లేదు. అయితే గుండిచా ఆలయం త్వరలో నిత్యం దర్శించుకునేందుకు వీలవుతుంది. ఈ మేరకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు(సీఏవో) మరియు జిల్లా కలెక్టర్‌తో సమీక్షించిన తర్వాత స్థానిక మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి ఈ విషయం తెలిపారు. భక్తులు నిత్యం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు గుండిచా మందిరంలోనికి ప్రవేశించవచ్చు. భద్రతా కార్యకలాపాల కోసం 20 జగన్నాథ ఆలయ పోలీసులు (జేటీపీ)ని మోహరించనున్నట్లు వివరించారు. ఆలయ పరిసరాల్ని శుభ్రపరచి భక్తులు, సందర్శకులకు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీగుండిచా ఆలయం పరిసరాల్లో యాత్రికుల రాకపోకలకు వీలుగా అడ్డుగా ఉన్న అన్ని దుకాణాలు తొలగిస్తారని కార్యనిర్వాహక అధికారి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
