 
															‘తుఫాన్ నష్టాలు నివారించగలిగాం’
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోంథా తుఫాన్ అనంతరం రాష్ట్ర ఎకై ్సజ్, ప్రజాపనులు, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పర్లాకిమిడి వచ్చి కలెక్టరేట్‌లో తుఫాన్ పునరావాస చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కాశీనగర్ బ్లాక్ ఖరడ పంచాయతీలో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని, పర్తాడ పంచాయతీలో గోర్బా, లింగా రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయని, వాటిని సకాలంలో యంత్రాలతో తొలగించామని కలెక్టర్ మధుమిత తెలిపారు. ఆర్.ఉదయగిరిలో రామగిరి, బోడాగాం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయని, వాటిని యంత్రాలతో సకాలంలో తొలగించామని అన్నారు. జిల్లాలో 20వేల మంది తుఫాన్ బాధితులను గుర్తించి సురక్షిత ప్రాంతాలు, పాఠశాలలకు తరలించామని కలెక్టర్ అన్నారు. అలాగే 197 గర్భిణులకు మాగృహాలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్లు కలెక్టర్ వివరించారు. గజపతి జిల్లాలో ఇళ్లు పోగొట్టుకున్న వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ సహాయం అందించాలని రాష్ట్ర మంత్రి హరిచందన్ అధికారులను ఆదేశించారు. అలాగే పంటనష్టపోయిన రైతులు సకాలంలో తమ నష్టాన్ని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయం పొందాలని సూచించారు. భవిష్యత్‌లో కొండ చరియలు విరిగి పడకుండా ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, బీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో తుఫాన్ వల్ల వల్ల ప్రాణ, ఆస్తినష్టం నివారించగలిగామని, అందుకు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహన శాసన సభ్యులు దాశరథి గోమాంగో, ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, ఆర్. అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్ అభిషేక్ శెఠి, ఎన్.డి.ఆర్.ఎఫ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, సి.డి.యం.ఓ. డాక్టర్ ఆలీ, జిల్లా పరిషత్ సీడీఓ శంకర్‌కెరకెటా, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, కాశీనగర్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
 
							‘తుఫాన్ నష్టాలు నివారించగలిగాం’

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
