 
															నేడు అమలా నవమి
భువనేశ్వర్:
పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విస్తత ఏర్పాట్లు చేస్తుంది.
గట్టి భద్రత
రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజిస్ట్రేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాలు క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
 
							నేడు అమలా నవమి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
