 
															రద్దీ నియంత్రణకు చర్యలు
భువనేశ్వర్: పవిత్ర కార్తీక మాసం చివరి ఐదు రోజులు అత్యంత పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఈ ఐదు రోజులను పంచుకగా పిలుస్తారు. చివరి 5 రోజుల్లో పూజాదులు, శ్రీజగన్నాథుని దర్శనం కోసం భక్తజనం పరితపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీక్షేత్రం కిటకిటలాడుతుంది. శ్రీమందిరంలో భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. పూరీ శ్రీమందిరంలో రత్న వేదికపై మూల విరాటుల దర్శనం కోసం ప్రవేశం పరిమితం చేశారు. పంచుక రద్దీ నియంత్రణ కోసం కేవలం సింహద్వారం గుండా ఆలయం లోనికి ప్రవేశం పరిమితం చేసినట్లు తెలిపారు. మిగిలిన 3 ద్వారాల గుండా నిష్క్రమణకు ఏర్పాట్లు చేశారు. పంచుక నిర్వహణ పురస్కరించుకుని ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పూరీ జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం భక్తులు సింహ ద్వారం గుండా మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుంది. మిగిలిన 3 ద్వారాల ద్వారా బయటకు వచ్చేందుకు వీలు కల్పించారు. అంలా నవమి రోజు ఉదయం 5 గంటల నుంచి రాధాపాద దర్శనం అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. దర్శనం కోసం 11 వరుసలతో బారికేడ్ల ఏర్పాటు చేశారు.
పర్లాకిమిడి: పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌లో విండో ట్రయిల్ పరిశీలనకు ఈస్టుకోస్టు రైల్వే డివిజన్ వాల్తేరు నుంచి అసిస్టెంట్ డీఆర్‌ఎం ఈ.శాంతారాం విచ్చేశారు. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నం – గుణుపురం ప్యాసింజర్ ట్రైనులో విచ్చేసి పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌లో తాగునీరు, సీసీ కెమెరాలు, ప్లాట్‌ఫాంలో నూతన టికెట్ కౌంటర్, సీనియర్ సిటిజన్లకు లిఫ్టు పనులను పర్యవేక్షించారు. ఆయనతో పాటు పలువురు ఇంజినీర్లు, అసిస్టెంటు ఇంజినీర్లు ఉన్నారు. అనంతరం ఏడీఆర్‌ఎం శాంతారం వాల్తేరు వెళ్లిపోయారు.
భువనేశ్వర్: మత్తు రహిత క్యాంపస్ ఆవిష్కరణకు యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి క్యాంపస్‌లో మత్తు నిరోధక యాంటీ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తారు. కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి ఒక అధ్యాపకునికి ఈ బాధ్యత అప్పగిస్తారని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ తెలిపారు. ఈ మేరకు వారం రోజుల పాటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యోగా, శారీరక దృఢత్వం, పౌష్టిక ఆహార అలవాట్లపై అవగాహన పెంపొందిస్తారని మంత్రి వివరించారు.
భువనేశ్వర్: ఉప ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ భారతి నువాపడా అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. ఈ వర్చువల్ సమావేశంలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవకతవకలు లేకుండా దోషరహితంగా ఈ ఎన్నికల నిర్వహణ విజయవంతం చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ దిశలో అనుబంధ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
జైళ్లకు హోం గార్డులు కాపలా
భువనేశ్వర్: ఖాళీగా ఉన్న జైలు వార్డర్ పదవులు భర్తీ అయ్యేంత వరకు హోంగార్డులు జైళ్లకు కాపలాగా ఉంటారు. ప్రస్తుతం వార్డరు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు హోం గార్డులు జైళ్లకు కాపలా బాధ్యత వహిస్తారు. ఈ మేరకు జైళ్ల శాఖ అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాసింది. 600 వార్డు పోస్టులు ఖాళీగా ఉన్నందున భద్రత కోసం తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. హోం గార్డులు దాదాపు ఒక ఏడాది పాటు తాత్కాలికంగా ఈ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అవసరమైతే వారు నియమిత నియామకం వరకు జైలు కాపలా పనులు చేస్తారని స్పష్టం చేశారు.
 
							రద్దీ నియంత్రణకు చర్యలు
 
							రద్దీ నియంత్రణకు చర్యలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
