 
															మారణాయుధాలతో భయపెట్టి రూ.5 లక్షలు దోపిడీ
జయపురం: దుండగులు దారి కాచి పట్టపగలు వ్యాపారుల నుంచి రూ.5 లక్షలు దోపిడీ చేసిన ఉదంతం ఇది. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి ఖొటల్‌పొదర్ గ్రామ సమీప కొలాబ్ బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం జరిగినట్లు కుంద్ర పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్ నేడు వెల్లడించారు. దుండగులు రూ.5 లక్షల నగదుతో పాటు వ్యాపారుల వద్ద గల 4 సెల్‌ఫోన్లు దోచుకుపోయారని తెలిపారు. వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. పోలీసుల వివరణ ప్రకారం.. బుధవారం సాయంత్రం కొట్‌పాడ్‌కు చెందిన ఐదుగురు వ్యాపారులు దేబాశిస్ పట్నాయిక్, సాహిల్, శ్యామ్, సుదామ్, అనికేత్‌లు కారులో తమ వ్యాపార సంబంధమైన బకాయిల వసూలుకు వెళ్లి ఆ డబ్బుతో సాయంత్రం కారులో తిరిగి వస్తుండగా ఖొటల్‌పొదర్ గ్రామ సమీప వంతెన వద్ద దాదాపు 8 మంది దుండగులు కారుని ఆపారు. కారులో ఉన్నవారు కారు తలుపు తెరవకుండా లోపల ఉండి కారు ముందుకు నడిపేందుకు ప్రయత్నించగా దుండగులు కారు ముందు అద్దాలు, వెనుక వైపు అద్దాలు, కారు తలుపు అద్దాలు పగులగొట్టి మారణాయుధాలతో బెదిరించి కారు లోపల ఉన్న డబ్బు బ్యాగ్‌ను, వ్యాపారుల వద్దగల 4 సెల్ ఫోన్లను తీసుకుని పరారయ్యారు. ఈ సంఘటనపై వ్యాపారి దేబాశిస్ పట్నాయిక్ కుంద్ర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్ వెల్లడించారు. ఈ వ్యాపారులు ప్రతి బుధవారం కారులో డబ్బులు వసూలుకు వెళ్తుంటారని, ఈ విషయం తెలిసిన వారే ఈ దోపిడీ చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
