ఎక్మోపై 500 కిలోమీటర్ల ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ఎక్మోపై 500 కిలోమీటర్ల ప్రయాణం

Oct 31 2025 7:28 AM | Updated on Oct 31 2025 7:28 AM

ఎక్మోపై 500 కిలోమీటర్ల ప్రయాణం

ఎక్మోపై 500 కిలోమీటర్ల ప్రయాణం

● అరుదైన క్యాన్సర్‌ను జయించిన ఇంజినీర్‌ ● ప్రాణాలు కాపాడిన కిమ్స్‌ ఐకాన్‌ వైద్యులు

● అరుదైన క్యాన్సర్‌ను జయించిన ఇంజినీర్‌ ● ప్రాణాలు కాపాడిన కిమ్స్‌ ఐకాన్‌ వైద్యులు

మహారాణిపేట: ఒకటి కాదు, రెండు కాదు.. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం.. ఇలా శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒక్కసారిగా విఫలమయ్యాయి. 25 ఏళ్ల యువ ఇంజినీర్‌ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆశలు వదులుకున్న తరుణంలో.. విశాఖపట్నం కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి వైద్యులు ముందడుగు వేశారు. అత్యాధునిక పోర్టబుల్‌ ఎక్మో సపోర్ట్‌తో 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి, అరుదైన క్యాన్సర్‌కు సైతం చికిత్స అందించి ఆ యువకుడికి పునర్జన్మ ఇచ్చారు. ఈ సంక్లిష్టమైన కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్‌ ఐకాన్‌ క్రిటికల్‌ కేర్‌, ఎక్మో విభాగాధిపతి డాక్టర్‌ రవికృష్ణ గురువారం మీడియాకు వివరించారు.

భువనేశ్వర్‌ నుంచి విశాఖకు..

భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన యువకుడు, బహుళ అవయవాల వైఫల్యంతో ‘కార్డియోజెనిక్‌ షాక్‌’లోకి వెళ్లాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అక్కడి వైద్యులు కిమ్స్‌ ఐకాన్‌ను సంప్రదించారు. తక్షణమే డాక్టర్‌ రవి కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక ‘ఎక్మో రిట్రీవల్‌ బృందం’ భువనేశ్వర్‌ బయల్దేరింది. ‘మేము అక్కడికి చేరుకునేసరికే రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే అక్కడే అతనికి పోర్టబుల్‌ ఎక్మో అమర్చాము. ఊపిరితిత్తులు, గుండె పనిని ఆ యంత్రమే చూసుకుంటుండగా, 500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అంబులెన్స్‌లో ప్రారంభించాం. మధ్యలో రక్త పరీక్షల కోసం కేవలం ఒక్కసారి మినహా, ఎక్కడా ఆగకుండా విశాఖకు తీసుకొచ్చాం’అని డాక్టర్‌ రవికృష్ణ తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చాక, యువకుడికి ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయకపోవడం, మెదడులో రక్తస్రావం, కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఎక్మోపైనే ఉంచి నైట్రిక్‌ ఆకై ్సడ్‌ వంటి అత్యాధునిక చికిత్సలు అందించారు. ఈ చికిత్సలకు రోగి శరీరం వేగంగా స్పందించింది. అవయవాలు తిరిగి కోలుకోవడం ప్రారంభించాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఎక్మో సహా అన్ని సపోర్ట్‌ సిస్టమ్స్‌ను తొలగించి, యువకుడిని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు.

బయటపడిన అరుదైన క్యాన్సర్‌

రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక, అసలు ఈ పరిస్థితికి కారణమేంటని వైద్యులు లోతుగా పరిశీలించారు. రెండేళ్లుగా అతనికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. పరీక్షల్లో ఫియోక్రోమోసైటోమా అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక సమస్య ఉన్నట్లు తేలింది. అడ్రినల్‌ గ్రంథిపై ఏర్పడిన క్యాన్సర్‌ కణితి కారణంగా, అడ్రినలిన్‌ హార్మోన్‌ నియంత్రణ లేకుండా అధికంగా స్రవించడమే ఈ అవయవాల వైఫల్యానికి అసలు కారణమని గుర్తించారు. 9 రోజుల చికిత్స అనంతరం రోగిని డిశ్చార్జ్‌ చేసి, నాలుగు వారాల తర్వాత తదుపరి శస్త్రచికిత్స కోసం పిలిపించారు. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రావణి పర్యవేక్షణలో, సీనియర్‌ అనస్థటిస్టులు డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ అప్పలరాజుల సహకారంతో లాప్రోస్కోపిక్‌ పద్ధతిలో ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. అది మొదటి దశ క్యాన్సర్‌గానే ఉందని, ఇతర భాగాలకు విస్తరించలేదని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ యువ ఇంజినీర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాడని డాక్టర్‌ రవి కృష్ణ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement