 
															వాడీవేడిగా నేర సమీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఇటీవల జరుగుతున్న వరుస ఉదంతాలు, ప్రాపర్టీ నేరాలు, స్టేషన్లలో అధికారుల వ్యవహార శైలిపై ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీలు, స్టేషన్‌పరంగా జరుగుతున్న కొన్ని వ్యవహారాలపై సీఐ, ఎస్‌ఐలను గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సోంపేటలో టపాకుల వ్యవహారంపైనా సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, మరికొందరి పాత్రపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. మహిళలు తగాదా ల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా మహిళా పోలీసుల నే వినియోగించాలని వజ్రపుకొత్తూరు ఎస్‌ఐకు సూచించారు. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణ ను పట్టుకోవాలని, ఈనెల 16న జిల్లా కోర్టు సమీ పంలోనే చోరీ చేసినా పట్టుకోకపోవడాన్ని గుర్తు చేశారు. చెక్‌పోస్టుల్లో గంజాయి, ఇసుక, ఇతర అక్ర మ రవాణాలను వదిలే పోలీసులపై ఇప్పటికే నిఘా ఉందన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘాపెట్టి అల్లర్లు చెలరేగకుండా చూడాలన్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన పర్చాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
