 
															యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
నరసన్నపేట: మండలంలో ఇసుకాసురుల అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా పోతోంది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ వంశధార నదిలో ఇసుకను ఎటువంటి అనుమతులు లేకపోయినా తవ్వి, రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోపాలపెంట కేంద్రంగా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నారు. పగలంతా అక్రమంగా మాకివలసకు వెళ్లే రోడ్డులో డంపింగ్ చేయడం, రాత్రి సమయాల్లో లారీల్లో లోడు చేసి పంపిస్తున్నారు. ఇదంతా ఓపెన్‌గా జరుగుతున్నా.. అటు మైన్స్ అధికారులు గానీ.. రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ తవ్వకాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను గ్రామంలోని ప్రధాన వీధి మీదుగా తరలిస్తుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.అలాగే మడపాం, బుచ్చిపేట, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురంల్లో కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో అటు ట్రాక్టర్లు, ఇటు ట్రిప్పర్లు, లారీల యజమానులు అప్పనంగా ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
