పశువుల అక్రమ రవాణా అడ్డగింత
జయపురం: సదర్ పోలీసుస్టేషన్ పరిధి 26వ జాతీయ రహదారిలో ఒక ట్రక్కులో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిన జయపురం హిందూ సమాజ్ కార్యకర్తలు ట్రక్కును అడ్డుకున్నారు. వెంటనే పట్టణ పోలీసులు చేరుకొని ట్రక్కుని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కులో 7 ఆవులతో పాటు 30 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 5 ఎద్దుల మృతదేహాలు ఉండడం గమనార్హం. నవరంగపూర్ జిల్లా నుంచి పశువులను తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జీవించి ఉన్న 32 పశువులను పంజియగుడలోని గోశాలకు తరలించారు. పశువులను నవరంగపూర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం తీసుకెళ్తున్నామని, అక్కడ నుంచి మరో ట్రక్కులో హైదరాబాద్ తీసుకెళ్లనున్నట్లు ట్రక్కు డ్రైవర్ పి.రాజు వెల్లడించాడు.
ఉత్సాహంగా సురభి శిశు మహోత్సవం
జయపురం: జయపురం బ్లాక్ విద్యా విభాగం ఆధ్వర్యంలో కలియగాం గ్రామ పంచాయతీ బొడొజివుని గ్రామంలో శిశు మహోత్సవం సురభి–2025 మహోత్సవం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో 18 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శణ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలియగాం సాధన కేంద్ర కో–ఆర్డినేటర్ రామేశ్వర పండ, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అధికారి చందన కుమార్ నాయిక్, ఒడిశా నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శశిభూషణ దాస్, జయపురం విద్యా విభాగ అధికారి రాజేంద్రనాథ్ పాడి, జయపురం విద్యా విభాగ అధికారులు కె.గోపాలరావు, సోమనాథ్ గదబ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ పోటీలకు రాయగడ క్రీడాకారిణి
రాయగడ: ఈనెల 28వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు రాయగడకు చెందిన క్రీడాకారిణి స్వీటీ ప్రధాన్ ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్రం నుంచి బాలికల విభాగంలో స్వీటీకి మాత్రమే ఈ అవకాశం లభించిందని రాయగడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమాన్షు శేఖర్ పాండియా, కార్యదర్శి సురేష్ చంద్ర పండలు అభినందించారు. అసోసియేషన్‌తరుపున ఆమెకు రూ.23 వేల ఆర్థిక సాయం అందజేశారు.
పంచాయతీ ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వాలి
మల్కన్‌గిరి: గ్రామాల్లోని అభివృద్ధి పనుల్లో పంచాయతీ ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వాలని ఖోయిర్‌పూట్ సమితిలో 11 పంచాయతీల సర్పంచ్‌లు కోరారు. ఈ మేరకు చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో రాష్ట్ర ప్రభుత్వ బికసిత్ గ్రామ – బికసిత్ ఒడిశా కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో తమకు ప్రాధాన్యమివ్వడం లేదని ఆరోపిస్తూ బీడీవో ఉమాశంకర్ కోయకు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
పశువుల అక్రమ రవాణా అడ్డగింత


