భువనేశ్వర్ విమానాశ్రయం డీజీఎం అరెస్టు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్ పటేల్‌ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. తన వైవాహిక స్థితిని దాచిపెట్టి ఎయిర్ హోస్టెస్‌ను మోసం చేసి అక్రమ సంబంధం కొనసాగించాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా భారతీయ న్యాయ సంహితలోని బహుళ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత శనివారం అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఉమాకాంత్ పటేల్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి 4 నెలల క్రితం స్థానిక విమానాశ్రయానికి బదిలీ చేయబడ్డాడు. ఢిల్లీలో తన పదవీకాలంలో ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఎయిర్‌హోస్టెస్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. తాను అవివాహితుడినని మాయమాటలు చెప్పి లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆరోపణ. ప్రియురాలు గర్భవతిగా ఖరారు కావడంతో ఆమెను బెదిరించి గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడు. ఇంతలో ఎయిర్‌హోస్టెస్ తన మకాం భువనేశ్వర్‌కు మార్చి తన పనిని కొనసాగించింది. ఉమాకాంత్ పటేల్ అప్పటికే వివాహితుడు మరియు ఒక బిడ్డ తండ్రిగా ప్రియురాలు తెలుసుకోవడంతో విషయం మలుపు తిరిగింది. అతనితో గొడవ పడిన తర్వాత ఆమెను బెదిరించడంతో ఎయిర్‌పోర్ట్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఉమాకాంత్ పటేల్‌ను అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాచుపాము కలకలం
మల్కన్‌గిరి: జిల్లాలో బలిమెల పట్టణం 12వ వార్డులోని డంపింగ్ యార్డ్ కాలనీలో ఒక వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి తాచుపాము కలకలం సృష్టించింది. దీంతో వెంటనే వారు బలిమెల స్నేక్ హైల్ప్‌లైన్ సభ్యుడు రాజేంద్ర ఖోరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి అతికష్టం మీద పామును పట్టుకున్నాడు. అనంతరం శనివారం ఉదయం నక్కమామ్ముడి పంచాయతీ డుమరిపదో అడవిలో విడిచిపెట్టాడు.


