కార్మికుల హక్కులు కాల రాస్తున్నారు
జయపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సాధారణ ఒడిశా రాష్ట్ర కార్యదర్శి బిజయ జెన ధ్వజమెత్తారు. స్థానిక కార్మిక భవనంలో ఏఐటీయూసీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహంతి అధ్యక్షతన కొరాపుట్, నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాల కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను హరించే కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. మరలా ప్రస్తుతం కార్మికులు రోజుకు 10 గంటల పని చేయాలన్న మరో చట్టాన్ని తెచ్చిందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులకు నిర్దేశించిన 8 గంటల పని దినాలను, 10 గంటలకు పెంచిందని, అలాగే మహిళా ఉద్యోగులు రాత్రులు కూడా పని చేయాలనే చట్టాలు తీసుకు రావడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. పాలకులు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా నవంబర్ 10వ తేదీ వరకు ప్రతీ జిల్లాలో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మొండికేస్తే డిసంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భువనేశ్వర్‌లో ధర్నాలు, ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. ఈనెల 31వ తేదీన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రతిష్టా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో కార్మికుల సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక నేత జుధిస్టర్ రౌళో, ఉత్తమ మల్లిక్, డొమయ్ మఝి, సనాతన సాహు, భాను పూజారి, మహానంద దుర్గ, కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు.


