జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ తహసీల్ పరిధి బముణిగుడ గ్రామ ప్రాంతంలో కొంతమంది కబ్జా చేసిన గోచర, అటవీ, దేవదాయ భూములకు వారి నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులంతా సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో కాలి నడకన 26వ జాతీయ రహదారి మీదుగా జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బముణిగుడ గ్రామ సమీపంలోని భైరాగిపొదర్ మౌజలో ఉన్న ప్రభుత్వ, గోచర(పశువులు మేసే భూములు), అటవీ భూములు, దేవదాయ భూములను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ ద్వారా ఆ భూముల్లో నాటిన పండ్ల మొక్కను తొలగించి, మొక్కజొన్న పంటలు పండిస్తున్నారని ఆరోపించారు. అందువలన అధికారులు పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


