
వితరణ..
కొరాపుట్: జయపూర్ రోటరీ క్లబ్ ప్రభుత్వ పాఠశాలకి వితరణ చేసింది. గురువారం పట్టణంలోని డెప్పిగుడ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ద్వారాన్ని అందజేశారు. గేటు లేకపోవడంతో రాత్రి వేళ అసాంఘిక శక్తులకు ఈ పాఠశాల ప్రాంగణం అడ్డాగా మారింది. ఇది తెలుసుకొని క్లబ్ సభ్యులు స్టీల్ గేటు, గదులకు ప్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఈఓ చందన్ కుమార్ నాయక్, హెడ్ మాస్టర్ శంకరి దళపతి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అమర్ బుధవార్, కార్యదర్శి నారాయణ నిశాంక్, నిసాన్ పట్నాయక్, బి.శ్రీనివాసరావు, శివాజి పట్నాయక్, గణేష్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధుడు మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చైనా మార్కెట్ సమీపంలో వాటర్ ట్యాంక్ లైన్‌లో నివసిస్తున్న చెల్లూరి సూర్యనారాయణ (106) గురువారం వేకువజామున మృతి చెందారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా వచ్చినవారు సూర్యనారాయణను కలిసి ఆరోగ్య రహస్యాన్ని అడిగేవారు. తన పని తాను చేస్తూ, దైవ చింతనలో ఎక్కువగా సూర్యనారాయణ ఉండేవారు. ఇతని మృతి వార్త విని మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, తదితరులు అంతిమ కార్యక్రమంలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.
ఆక్రమణల తొలగింపుపై నిరసన
కొరాపుట్: జయపూర్ పట్టణంలోని పారాబెడాలో విక్రమ్ దేవ్ క్రీడా మైదానానికి ఆనుకుని బ్లాక్ ఆఫీస్ మార్గంలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు గురువారం ఉపక్రమించారు. పెద్ద ఎత్తున పోలీసులు, జేసీబీలతో మున్సిపల్ సిబ్బంది తరలి వచ్చారు. తొలగింపులు ప్రారంభం కాగానే వ్యాపారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంలో అధికారులు ఆక్రమణల తొలగింపుని వాయిదా వేసి వెనుతిరిగారు.
మావోయిస్టు నేతకు మాతృవియోగం
వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యులు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మాతృమూర్తి మెట్టూరు చినపిల్లమ్మ (92) గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.
చినపిల్లమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో సంతానం జోగారావు. చినపిల్లమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అదే గ్రామంలో చేపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వితరణ..

వితరణ..

వితరణ..