బాలికకు నిప్పంటించిన దుండగులు | - | Sakshi
Sakshi News home page

బాలికకు నిప్పంటించిన దుండగులు

Jul 20 2025 5:43 AM | Updated on Jul 20 2025 5:43 AM

బాలికకు నిప్పంటించిన దుండగులు

బాలికకు నిప్పంటించిన దుండగులు

భువనేశ్వర్‌: పూరీ జిల్లా నిమ్మాపడా మండలం బయాబర్‌ గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేసి నిప్పంటించారు. ఈ దారుణం శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. స్నేహితురాలి ఇంటి నుంచి నడుచుకుంటూ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆమె ఇంటి నుంచి 200 మీటర్ల దూరంలో జరిగింది. స్థానిక భార్గవి నది ఒడ్డున నిర్జన ప్రదేశంలో అడ్డగించి ఆమైపె పెట్రోల్‌ పోసి, నిప్పంటించి దుండగులు పారిపోయినట్లు గ్రామస్తుల సమాచారం.

మంటల్లో చిక్కుకున్న ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరి మంటలను ఆర్పి పిప్పిలి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఉన్నత చికిత్స కోసం ఆమెను ఎయిమ్స్‌ భువనేశ్వర్‌కు తరలించారు. బాధితురాలి శరీరం 70 శాతం పైబడి కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌ నుంచి బర్న్‌ వార్డుకు తరలించారు. బాధితురాలు పదే పదే స్పృహ కోల్పోతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు సమాచారం. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

గ్రామస్తుల వివరణ

మంటల్లో చిక్కుకున్న బాధితురాలి ఆర్తనాదంతో స్పందించిన గ్రామస్తులు తక్షణమే సహాయక చర్య లు చేపట్టారు. మంటలు నివారించి చేరువలో ఉన్న ఇంటికి తరలించి బట్టలు మార్చి చికిత్స కోసం స్థానిక పిప్పిలి ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరం సింహ భాగం కాలిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. స్నేహితురాలికి పుస్తకం ఇచ్చి తిరిగి వస్తుండగా 3 మంది వ్యక్తులు బైక్‌ మీద వచ్చిన గుర్తు తెలియని ఈ దాడికి పాల్పడ్డారు. వీరంతా ముఖా నికి రుమాలు చుట్టుకుని ఉన్నట్లు బాధితురాలు తెలియజేసినట్లు గ్రామస్తులు వివరించారు.

తదనంతర చర్యలు

మైనరు బాలికపై అమానుష దాడికి పాల్పడిన ఆగంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

ప్రత్యేక బృందాల గాలింపు

ఘాతుకానికి పాల్పడి ఘటనా స్థలం నుంచి పారిపోయిన వారిని గాలించి పట్టుకునేందుకు పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం చురుకుగా స్పందించింది. 2 ప్రత్యేక పోలీసు బృందాలను గాలింపు చర్యల కోసం నియమించినట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ పినాక్‌ మిశ్రా తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నందున ఆమె నుంచి సంఘటన పరమైన వివరాలు సంగ్రహించడం సాధ్యం కాలేదని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దాడికి గల కారణం ముఖచిత్రం అస్పష్టంగా ఉందన్నారు. లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో బాలాసోర్‌లో 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆత్మాహుతితో మరణించిన సంఘటన ఆవేదన నుంచి రాష్ట్ర ప్రజానీకం కోలుకోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం తీవ్రమైంది. బాధితురాలు చికిత్స పొందుతున్న ఎయిమ్స్‌ ప్రాంగణం రాజకీయ వర్గాల తాకిడితో అట్టుడికి పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement