● ట్రాక్టర్ బోల్తా పడి అన్నాచెల్లెల్లు మృతి
● ప్రమాదం నుంచి బయటపడిన మరో నలుగురు
● కామేశ్వరిపేట సమీపంలో ప్రమాదం
● లుకలాంలో విషాదఛాయలు
నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెల్లు మృత్యువాతపడిన విషాద ఘటన నరసన్నపేట మండలం కామేశ్వరిపేట సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నరసన్నపేట మండలం లుకలాం గ్రామానికి చెందిన గొడ్డు ఆదినారాయణ(42), చోడి లక్ష్మి (35), జి.బంగారమ్మ, లంక శ్రీనివాస్, గొడ్డు అశోక్‌కుమార్‌లు ఓ కర్రల వ్యాపారి వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో ఆదినారాయణ, లక్ష్మి అన్నాచెల్లెలు. పరిసర గ్రామాలకు వెళ్లి కర్రలు కొట్టడం, వాటిని ట్రాక్టర్‌పై లోడ్ చేసి తరలించడం వీరి దినచర్య. దీనిలో భాగంగా మంగళవారం స్వామి అనే వ్యక్తి ట్రాక్టర్‌పై కామేశ్వరిపేటకు బయలుదేరారు. కొల్లవానిపేట రైల్వే గేటు దాటి కొంతదూరం వెళ్లేసరికి టైర్ పంక్చర్ అయింది. వేగంగా వెళ్తుండటంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలో తుప్పల్లోపడింది. ట్రాక్టర్, ఇంజన్ చెరోవైపు పడిపోయాయి. ట్రాక్టర్ కింద ఆదినారాయణ, లక్ష్మి ఇరుక్కుపోయారు. మిగిలిన వారు తేరుకుని వీరిద్దరినీ బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోను చేయగా కొద్దిసేపటికే మరణించారు.
కూలి పనులు చేస్తూ..
విజయనగరంలోని నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మి లుకలాం వచ్చి స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచీ ఏ పనికి వెళ్లినా అన్నాచెల్లెల్లు కలిసే వెళ్లేవారు. మృత్యువులోనూ అన్నాచెల్లెల్లు బంధం వీడలేదంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. లక్ష్మికి భర్త చిన్నారావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదినారాయణకు భార్య గున్నమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసన్నపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ, పోలాకి ఎస్‌ఐ రంజిత్ ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ శ్రీను, వైఎస్సార్ సీపీ నాయకులు చింతల వెంకటరమణ, చింతల సత్యం, కామేశ్వరపేటకు చెందిన జోగినాయుడు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.
మృత్యువులోనూ వీడని బంధం
మృత్యువులోనూ వీడని బంధం
మృత్యువులోనూ వీడని బంధం