
గంజాయి ముఠా అరెస్టు
కాశీబుగ్గ: బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాశీబుర్ల డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆశాదేవి, అనితాదేవి, ఊహాదేవిలు పాట్నాలో ఓ అపార్ట్‌మెంట్‌లో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి పింకీ అనే మహిళ ద్వారా శుభరాత్, అంబాజ్ గౌడ్‌లు పరిచయమయ్యారు. సులభంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి బీహార్, కేరళ రాష్ట్రాలకు తరలించేందుకు వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కే ప్రయత్నంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టుకు తరలించామని చెప్పారు. సమావేశంలో సీఐ సూర్యనారాయణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.