
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైకిస్టు
జయపురం: ఛతీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వాహనాన్ని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకిస్టుతోపాటు కానిస్టేబుల్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఛతీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంప పోలీసుస్టేషన్ సిబ్బంది కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు అరుకులో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారు కొరాపుట్ జిల్లాకు వచ్చి సెమిలిగుడ పోలీసుల సహకారంతో నిందితుడుని పట్టుకోగలిగారు. అతడిని బొయిపరిగుడ, మల్కనగిరిల మీదుగా సుకుమకు తీసుమకు గురువారం రాత్రి తీసుకెళ్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో బోయిపరిగుడలోని పెట్రోల్ పంపు సమీపంలోని డాబా హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు వెళ్తున్న సమయంలో బలిగుడ గ్రామానికి చెందిన ప్రఫుల్ల మడకామి ద్విచక్ర వాహనంపై రామగిరి గ్రామం నుంచి వస్తూ పోలీసు వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైకిస్టు ప్రఫుల్ల మడకామి, పోలీసు వాహనం డోర్ పక్కన కూర్చున్న పోలీసు హవల్ధార్ అరేంద్ర యాదవ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హవల్దార్ చెవికి పెద్ద గాయమవ్వగా.. ప్రఫుల్ల మడకామికి తలపై బలమైన గాయమైంది. ప్రాథమిక చికిత్స తరువాత ప్రఫుల్లను జయపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసు కానిస్టేబుల్ అరెంద్ర యాదవ్ ను ఛత్తీస్‌గడ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంపకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుల్, బైకిస్టుకు గాయాలు