
గండం గడిచింది!
ఎచ్చెర్ల: నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ప్రాణభయంతో విలవిల్లాడిపోయారు. సాయం కోసం మైరెన్, పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఈ సమయంలో మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం కొయ్యాం సముద్ర తీరానికి సుమారు 45 మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. బాధిత మత్స్యకారులు, బోటు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన పది మంది మత్స్యకారులు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు సముద్రంలో వేటకోసం బయల్దేరారు. ఎచ్చెర్ల మండలంకొయ్యాంకు 45 మైళ్ల దూరంలో ఉండగా బోటు చెక్క పక్కకు ఒరిగిపోవడంతో లోపలికి నీరు ప్రవేశించింది. కొద్దికొద్దిగా బోటు మునిగిపోయే సూచనలు కనిపించాయి. దీంతో బోటులో ఉన్న వారు వారి యాజమాని వాసపల్లి ధనారాజ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన మైరెన్ సిబ్బంది, పోలీసులకు, వేరే బోటు నిర్వాహకులకు ఫోన్‌లు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో మరో బోటు రావడంతో వారిని సాయం అడిగారు. వారు తొలుత సహకరించకపోవడంతో వలకు అడ్డుగా బోటును నిలబెట్టడంతో సాయం చేసేందుకు అంగీకరించారు. పది మంది మత్స్యకారులు ఆ బోటులోకి వెళ్లిపోయారు. 10వ తేదీ మొత్తం ఆ బోటు లోనే గడిపారు. 11వ తేదీ ఉదయం కొయ్యాం తీరానికి చేరుకున్నారు. అప్పటికే యజమాని వచ్చి ఆటోలో మత్స్యకారులను విశాఖకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో సుమారు 90 లక్షల విలువైన బోటు మునిగిపోయిందని యజమాని తెలిపారు.
చనిపోతే వస్తామన్నారు..
అంతకుముందు బోటు యాజమాని వాసపల్లి ధనరాజ్ మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సాయం అందించాలని మైరెన్ సిబ్బందికి తెలియజేశాం. ఎవరూ స్పందించలేదు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరైనా చనిపోతే అప్పుడు వస్తామని బదులిచ్చారని, సముద్రంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు.
నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు
బోటులో నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి
మైరెన్, పోలీసులకు తెలియజేసినా కానరాని స్పందన
మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు..