
కలెక్టర్ దృష్టికి ఇసుక కొరత సమస్య
రాయగడ: గత ఆరు నెలలుగా జిల్లాలోని గుణుపూర్‌లో ఇసుక కొరత ఏర్పడిందని పట్టణ వాసులు జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి దృష్టికి తీసుకువచ్చారు. గుణుపూర్‌లోని వంశధార నదీ ప్రాంతంలో మూడు ఇసుక రీచ్‌లు ఉన్నప్పటికీ అవి ఆరు నెలలుగా మూత పడిపోవడంతో పట్టణంలో నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయని కలెక్టర్‌ను మంగళవారం కలిసి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ఇసుకను తీసుకురావడానికి 2,500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. దీంతో నిర్మాణ వ్యయం అధికమవ్వడంతో నానా అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. వంశధార నదీ తీరంలో ఇసుక రీచ్‌లు పునః ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో మాజీ కౌన్సిలర్ పూర్ణ బవురి, జితేంద్ర నాయక్, భైరబ్ బెహర, కేశవ్ మహాంతి తదితరులు ఉన్నారు.
జల దిగ్బంధంలో భట్టారిక ఆలయం
భువనేశ్వర్: కటక్ జిల్లా బొడొంబ ప్రాంతంలో ప్రసిద్ధ భట్టారిక ఆలయం వరద నీటి దిగ్బంధంలో చిక్కుకుంది. మహానది వరద నీటి మట్టం దాదాపు ఆలయ శిఖరాన్ని తాకింది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ఓ వైపను మహా నది వరద నీరు ఉప్పొంగుతుంది. భట్టారిక ఆలయం జల దిగ్బంధంలో ఉన్నందున ఈ పరిసరాలకు రావద్దని సాధారణ ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ప్రధాన కూడలి ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. మరో వైపు ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాల్ని మోహరించారు.
నెల రోజులుగా 110 కుటుంబాలు అంధకారంలోనే..
కొరాపుట్: సుమారు నెల రోజుల పైగా 110 కుటుంబాలు అంధకారంలో జీవిస్తున్నాయి. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంతలుంగు గ్రామ పంచాయతీ తుంబర్‌కోట్ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలి పోయింది. ఇది జరిగి నెల రోజులు దాటినా విద్యుత్ సిబ్బంది ఆ గ్రామం వైపు చూడడం లేదు. గిరిజనులు విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కి లిఖితపూర్వక ఫిర్యాదు పంపించారు. విద్యుత్ లేకపోవడంతో రాత్రి పూట గిరిజనులు బయటకు రావడం లేదు. సెల్‌ఫోన్లు పని చేయకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. భారీ వర్షాలు వల్ల విద్యుత్ లేకపోవడంతో అనేక బాధలు పడ్డామని గిరిజనులు వాపోయారు.
సేవాయత్‌లకు వ్యతిరేకంగా ఫిర్యాదు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని పవిత్ర రథ యాత్ర సమయంలో రథాలపై మొబైల్ ఫోన్ నిషేధాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో పూరీ శ్రీ జగన్నాథ ఆలయ కార్యాలయం సేవకుల వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని ప్రాథమిక సమాచార నివేదికగా (ఎఫ్‌ఐఆర్) పరిగణించి వారి వ్యతిరేకంగా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరింది. రథాలపై మొబైల్ ఫోన్లు నిషేధాన్ని ఉల్లంఘించినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సేవకులు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు చూపించే మూడు ఫొటోగ్రాఫిక్ ఆధారాలు ఫిర్యాదుతో జోడించారు. దీని ఆధారంగా విచారణ చేపట్టి నిందితుల వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థించినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రథాలపై సేవాయత్‌ల చర్యలు ఆచారాల పవిత్రతకు విఘాతం కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ దృష్టికి ఇసుక కొరత సమస్య