
విధుల నిర్వహణలో అప్రమత్తతే కీలకం : డీఆర్‌ఎం
భువనేశ్వర్: రాత్రింబవళ్లు పట్టాలపై పరుగులు తీసే రైళ్ల నిర్వహణలో సిబ్బంది నిరంతర అప్రమత్తతే బలమైన భద్రతా కవచమని, రెప్పపాటు తప్పిదం కూడా ఘోర ప్రమాదాల్ని ప్రేరేపించే పరిస్థితుల్లో అప్రమత్తత ప్రదర్శించి విధుల నిర్వహణలో సిబ్బంది అంకిత భావం చాటుకున్నారని ఖుర్దారోడ్ రైల్వే మండల అధికారి (డీఆర్‌ఎం) హెచ్‌ఎస్ బజ్వా అన్నారు. డివిజన్‌లోని నలుగురు రైల్వే ఉద్యోగులను గుర్తించి భద్రతా అవార్డులతో సత్కరించారు. డీఆర్‌ఎం చేతుల మీదుగా సత్కారం పొందిన వారిలో లోకో పైలట్ పి.శ్రీనివాస రావు (ఖుర్దారోడ్), టీపీఎంఏ సుధాంశు స్వంయి (కటక్), టీపీఎంఏ అభిమన్యు దొలై (జఖ్‌పురా), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (టెక్నికల్) ఉత్తమ్ కుమార్ దాస్ (ఖుర్దారోడ్, మెము కార్ షెడ్) ఉన్నారు. సిబ్బంది అభినందన సభ కార్యక్రమంలో అదనపు మండల రైల్వే అధికారి (ఇన్‌ఫ్రా) శుభ్ర జ్యోతి మండల్, సీనియర్ మండల భద్రత విభాగం అధికారి (ఎస్‌డీఎస్‌ఓ) నమో నారాయణ్ మీనా, ఇతర బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో డీఆర్‌ఎం హెచ్. ఎస్. బాజ్వా మాట్లాడుతూ పెను సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సురక్షిత, సమర్థమైన రైళ్ల నిర్వహణలో అవిశ్రాంతంగా పని చేసే రైల్వే ఉద్యోగుల అచంచలమైన అంకిత భావం ప్రశంసనీయమన్నారు. వీరి అంకితభావం గుర్తించి అభినందించడం తోటి సిబ్బందిని ప్రోత్సహిస్తుందన్నారు. మండల అధికారుల అభినందనలతో ప్రత్యేక భద్రతా పురస్కారం అందుకున్న సిబ్బందికి తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.