
దేవతామూర్తులకు పూజలు
రాయగడ: గుండిచా మందిరం నుండి జగన్నాథ మందిరానికి తరలివచ్చిన దేవతామూర్తులు జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవిలు ఆదివారం సునాబొజేలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏకాదశి పర్వదినం కావడంతో రథాలపై దేవతామూర్తులను ఉంచి అలంకరించారు. ఈ సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన బందొస్తును ఏర్పాటు చేసారు.
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బాలాజీనగర్‌లో గల కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి సుప్రభాత, అభిషేక కార్యక్రమాలతోపాటు రమాసత్యనారాయణ వ్రత పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు.
పట్టణ బీజేడీ అధ్యక్షునిగా ప్రమోధ్ కుమార్
కొరాపుట్: నబరంగ్‌పూర్ పట్టణ బీజేడీ అధ్యక్షునిగా ప్రమోధ్ కుమార్ రఽథ్ నియమితులయ్యారు. బీజేడీ పార్టీ నబరంగ్‌పూర్ జిల్లా ఎన్నికల రిట్నరింగ్ అధికారి సచింద్ర స్వయ్ ఆదివారం తెలియజేశారు. ప్రమోద్ కుమార్‌కు ఈ పదవి వరుసగా ఐదో సారి ఎన్నికయ్యారు. ప్రమోద్‌కు పార్టీ మాజీ ఎంపీలు రమేష్ మజ్జి, ప్రతిప్ మజ్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పదవీ కాలం మూడేళ్లు ఉండనుంది.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ (1938) జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బి.రవి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పలువురు వక్తులు మాట్లాడారు. నాడు–నేడుతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలని కోరారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌ల పేరిట బడుల్లో విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గిన్నిస్‌రికార్డుల కోసం ఆరాటమే తప్ప విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు టి.చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, బాలాజీరావు, ఆర్.వి.అనంతాచార్యులు, బి.నవీన్, కృష్ణారావు, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్ తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థలో భాగమైన ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నా ట్రోలింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.వ్యక్తి కంటే వ్యవస్థలే ముఖ్యమని, అటువంటి వారిని అవమానిస్తే, న్యాయవ్యవస్థను అవమాన పరిచినట్లేనని పేర్కొన్నారు. ట్రోల్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించించాలని కోరారు.
ఉత్సాహంగా
చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరుతీసుకురావాలని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్ ఆకాంక్షించారు. జిల్లాస్థాయి అండర్–15 చెస్ ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొని ఎత్తుకు పైఎత్తులేశారు. బాలుర విభాగంలో డొంకాడ కార్తికేయ ప్రథమ, బొల్ల యశ్వంత్ ద్వితీయ, ఎన్‌కేపీ నిహల్ తృతీయ, పొన్నాడ వేదిష్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో మెట్ట తీక్షణ, బొల్ల శృతి, జామి వినమ్ర, రిత్విక తొలి నాలుగు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

దేవతామూర్తులకు పూజలు

దేవతామూర్తులకు పూజలు