
కుంభేయిగుడలో ఏనుగుల సంచారం
రాయగడ: రాయగడ అటవీ రేంజ్ పరిధిలోని కుంభేయిగుడ ప్రాంతంలో మూడు గున్న ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాటి సంరక్షణకు సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ నిలిపివేసింది. విద్యుత్ ఘాతానికి గురైతే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న ముందస్తు చర్యలతొ అధికారుల ఆదేశానుసారం ఆయా ప్రాంతంలో విద్యుత్ సరఫరాను గత రెండు రోజులుగా నిలిపివేశారు. అయితే సమీపంలో గల గ్రామంలో విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ అటవీ ప్రాంతం వైపు గల విద్యుత్ తీగలకు సంబంధించి సరఫరాను నిలిపివేశారు. అటవీ రేంజ్ పరిధిలో గల పొంగిలి, సూరి, ఫకిరీ, కుంభేయిగుడ, తొటాగుడ, ఖమాసింగి అదేవిధంగా బొడొఖిల్లాపదర్ పంచాయతీలొని అరబి, ఖరగడి, సన గుమడ, బొడొగుమడ తదితర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆది, సొమవారాల్లో ఆయా ప్రాంతాల్లొ పర్యటించిన అటవీ శాఖ అధికారులు ఏనుగుల నడక గుర్తులను గుర్తించారు. ఒక ఆడ ఏనుగు, ఒక మగ ఏనుగుతో పాటు మరో చిన్న ఏనుగు పిల్ల ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఏనుగుల సంచారానికి సంబంధించి గ్రామస్తులను చైతన్య పరిస్తున్న అధికారులు వాటి నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు గురించి వివరించారు.

కుంభేయిగుడలో ఏనుగుల సంచారం