సమస్యల పరిష్కారానికి పోరాటం
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయగడ జిల్లాలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు తాను సాయశక్తులా పొరాడుతానని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన పరిధిలోని వివిధ సమస్యలు, వాటిపరిష్కారం కోసం చేసిన కృషిని వెల్లడించారు. ఈ మేరకు స్థానిక తేజస్వీని హోటల్ సమావేశం హాల్‌లొ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ఆయా గ్రామాలకు అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. ఏడాదిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు 96 శాతం హాజరై దాదాపు 253 ప్రశ్నలు వేసినట్లు వివరించారు. పెరుగుతున్న దొంగతనాలు, దోపీడీలతో ప్రజలు భాయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల మెరుగు పరిచేందుకు ప్రభుత్వం స్థానిక రాణిగుడఫారంలో మహిళా పోలీస్ స్టేషన్‌ను, అదేవిధంగా సాయిప్రియనగర్, రైతుల కాలనీల్లొ పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో ఎమ్మెల్యే నిధుల్లో భాగంగా సుమారు మూడూ కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంత రహదారులు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల
కోసం వెచ్చిస్తానన్నారు.
ధీనావస్థలో క్రీడా సంఘాలు..
జిల్లాలోని క్రీడాకారులకు ఉత్సాహ పరిచేవిధంగా ఏర్పాటు చేస్తున్న క్రీడా సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మరిందని ఎమ్మెల్యే అన్నారు. గత 20 ఏళ్లుగా క్రికెట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగలేదని అన్నారు. అధికారులు చొరవ తీసుకోకపొవడంతో క్రీడారంగం రానురాను కుంటుపడే పరిస్థితికి చేరకునే అవకాశం ఉందని.. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి క్రీడారంగం పునరుద్ధరణ కోసం కృషి చేస్తానని చెప్పారు. ఏడాది పూర్తయిన సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రొగ్రస్ రిపోర్టు సంచికను విడుదల చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండ, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ జిలకర్ర, డీసీసీ ఉపాధ్యక్షులు శంకర్షన్ మంగరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారి కృష్ణమూర్తి, సునీల్ చంద్ర పండ పాల్గొన్నారు.
రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక
సమస్యల పరిష్కారానికి పోరాటం


