
శ్రీ క్షేత్రంలో వైభవంగా నృసింహ జయంతి
● రథ స్తంభాల తయారీకి అంకురార్పణ
భువనేశ్వర్:
పవిత్ర వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి పురస్కరించుకుని సంప్రదాయం ప్రకారం ఆదివారం శ్రీ క్షేత్రంలో నృసింహ స్వామి జయంతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీమందిరం ముక్తి మండపం సమీపంలోని నరసింహ స్వామి ఆలయంలో నరసింహుడి జయంతి ఉత్సహభరితంగా నిర్వహించారు. సాయంత్రం ధూపం తర్వాత దక్షిణ గృహం నుంచి నరసింహ విగ్రహం పల్లకిలో ఊరేగింపుగా జగన్నాథ వల్లభ మఠానికి చేరి ఉత్సవ పూజాదులు అందుకున్నాడు. హిరణ్యకశిపుని వధ అక్కడే జరుగుతుంది. నరసింహుడిని జగన్నాథుని రక్షకుడిగా అభివర్ణించారు. ఆయన నందిఘోష రథానికి రక్షకుడు. శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథంలోని తొమ్మిది పార్శ్వదేవతలలో నరసింహ కూడా ఒకరు కావడం విశేషం. కొనసాగుతున్న రథాల తయారీ పనుల్లో నృసింహ జయంతి పురస్కరించుకుని ఈ పార్శ్వ దేవత తయారీ పనులకు అంకురార్పణ జరిపారు. ఈ సందర్భంగా రథాల స్తంభాల తయారీకి రూపకార్ సేవకులు శ్రీకారం చుట్టారు. 12 అడుగుల పొడవైన దూలం రథ తయారీ శాలకు తరలించడంతో విశ్వకర్మ మహరణల పర్యవేక్షణంలో లాంఛనంగా ఆరంభ పూజాదులు నిర్వహించారు. రూపకార్ వడ్రంగులు రథ స్తంభాలపై పార్శ్వ దేవతల మూర్తుల ఆకృతుల్ని తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియంలో భాగంగా తొలుత జగన్నాథుని నందిఘోష్ రథం స్తంభానికి నృసింహ మూర్తి ఆకృతిని తీర్చిదిద్దే పనులను ప్రారంభించారు.

శ్రీ క్షేత్రంలో వైభవంగా నృసింహ జయంతి