
రక్తపు మడుగులో మృతదేహం
భువనేశ్వర్: పొదల చాటున రక్తం మడుగుల్లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన బారంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం పూరీ కాలువ రోడ్డు పరిసరాల్లో కాలిపోతున్న వాహనాన్ని స్థానికులు గమనించి, గొడి సాహి పోలీస్ అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు మృతదేహం దగ్గర ఒక కర్ర చెక్క పడి ఉండటాన్ని గుర్తించారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు యువకుడిని కర్ర చెక్కతో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అనంతరం అతని వాహనాన్ని తగలబెట్టి, మృతదేహం పొదల్లో పడేసి పరారీ అయినట్లు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
మంచాగాం గ్రామ సర్పంచ్ మృతి
● కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి మంచాగాం పంచాయతీ గ్రామ సర్పంచ్ సదాశివ శాంత (45) అనారోగ్యంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నబరంగ్‌పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహం తరలింపు, అంత్యక్రియల ఏర్పాట్లకు సహకరించారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
కొరాపుట్: బైకులను చోరీ చేస్తున్న దొంగను నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌డీపీవో కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పపడాహండి సమితి దిసారి గుడ గ్రామానికి చెందిన లబో భోత్ర వాహనాలను చోరీ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో అతని ఇంటిపై నిఘా వేయగా హీరో హోండా ప్యాషన్ ప్లస్, హీరో హోండా స్పెండర్‌ప్లస్ బైకులు పట్టుబడ్డాయన్నారు. దీంతో అతన్ని విచారించగా తానే దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.
ఘనంగా త్రివర్ణ పతాక యాత్ర
భువనేశ్వర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు భవనేశ్వర్ నగరంలో జై హింద్‌ను యాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో స్థానిక రామ్ మందిర్ కూడలి నుంచి మాస్టర్ కాటిన్ చౌరస్తా వరకు యాత్ర సాగింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి పరాక్రమం, అపరిమిత ధైర్యం, అపారమైన శక్తిని ప్రదర్శించిన భారత సైనికుల గౌరవార్థం త్రివర్ణ పతాక యాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి కార్యకర్తలు గౌరవ వందనం సమర్పించారు. యాత్ర పురస్కరించుకుని జై హింద్, జై జవాన్ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. ఈ యాత్ర లో దేశ భక్తి సంగీతాన్ని ఆలాపించారు.