
పర్లాకిమిడిలో భానుడి భగభగలు
పర్లాకిమిడి: జిల్లాలో ఐదు రోజులుగా భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ వేడిమి అధికంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. మరో ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని ఐఎండీ. అధికారులు చెబుతున్నారు.
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితి అసనలో గల ప్రాథమిక వైద్య కేంద్రంలో శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. కొరాపుట్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్, సంబాదొ అమొ ఒడిశా సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో 33 యూనిట్ల రక్తం సేకరించారు. జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ రక్త బండార్ టెక్నీషియన్‌లు దాతల నుండి రక్తాన్ని సేకరించారు. కొరాపుట్ జిల్లా రక్త దాతల ఫోరం అధ్యక్షుడు సంజీవ కుమార్, అసోసియేషన్ కోశాధికారి సహేదా పరవాన్, తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణదాస్ మహాపాత్రోకు మరో నోటీసు
భువనేశ్వర్ : పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వివాదానికి సంబంధించి దైతపతి సేవకుడు రామకృష్ణ దాస్ మహాపాత్రోకు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద్‌కుమార్ పాఽఢి మరో నోటీసు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. దిఘాలోని జగన్నాథ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ‘జగన్నాథ్ ధామ్– దిఘా‘ అనే పేరును ఉపయోగించారని, దీనికి సంబంధించిన సైన్ బోర్డును ప్రదర్శించారని నోటీసులో పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి
మాతృ దినోత్సవం రద్దు
భువనేశ్వర్: దేశంలోని ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11న జరగాల్సిన రాష్ట్ర స్థాయి మాతృ దినోత్సవాన్ని రద్దు చేసినట్లు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపిక చేయబడిన ఉత్తమ, అత్యంత హత్తుకునే సెల్ఫీలు, సందేశాల విజేతలకు త్వరలో జరగనున్న సుభద్ర కార్యక్రమం వేదికపై బహుమతులు అందజేయబడతాయని ఆ విభాగం స్పష్టం చేసింది.