
మిగులు కలప దుర్వినియోగం కాలేదు: మంత్రి
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దిఘా జగన్నాథ ఆలయం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని తలెత్తిన ద్వంద్వ వైఖరి పరిస్థితి రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టి నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర న్యాయ శాఖ శ్రీ మందిరం అధికార వర్గానికి ఆదేశించింది. ఈ ప్రక్రియ ప్రాథమిక దశ ముగిసింది. మధ్యంతర నివేదిక న్యాయ శాఖకు చేరింది. నవ కళేబరం మిగులు కలప దుర్వినియోగం కాలేదని నివేదిక స్పష్టం చేసిందని మంత్రి వివరించారు. మధ్యంతర నివేదిక పూర్తి వివరాల్ని విభాగం మంత్రి మీడియాకు తెలియజేశారు.
శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ, న్యాయ శాఖ ప్రముఖ కార్యదర్శి సంయుక్తంగా మధ్యంతర నివేదిక దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక నిర్దిష్టమైన మార్గదర్శకాల్ని పేర్కొంది. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు వీటి వాస్తవ కార్యాచరణ అమలు ఖరారు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో ఆలయానికి జగన్నాథ్ ధామ్‌గా పేర్కొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమైందని, ధామ్ పద ప్రయోగం ఆమోద యోగ్యం కాదని కేవలం చతుర్థామ క్షేత్రాలకు మాత్రమే పరిమితమని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పశ్చిమ బెంగాలు సర్కారు విరమించుకోవాలని సంయుక్త నివేదిక సిఫారసు చేసింది.
దిఘా ఆలయం నామకరణం, సముద్రానికి మహా దధి వ్యవహారంలో దిఘా పదం తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాలు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. సానుకూలంగా స్పందించకుంటే న్యాయపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి స్పష్టం చేశారు.
సేవకులకు క్రమశిక్షణ మార్గదర్శకాలు
పూరీ శ్రీ మందిరంలో సేవాదుల్లో పాలుపంచుకుంటున్న సేవాయత్‌లు శ్రీ మందిరేతర దేవస్థానాల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంలో ప్రత్యేక మార్గదర్శకాలు తక్షణమే అమలు చేయాలి. ఈ చర్యతో సేవాయత్‌లో క్రమశిక్షణ తేటతెల్లమై పారదర్శకంగా వివాదరహిత ప్రవర్తనని పటిష్టపరుస్తుంది. ముక్తి మండపం పండిత్ సభ ఆధ్వర్యంలో నిర్దిష్టమైన కార్యాచరణ ఎస్‌ఓపీ రూపకల్పనకు నివేదిక సూచించింది. పూరీ శ్రీ జగన్నాథుని నవ కళేబరం మిగులు వేప చెక్కలు పశ్చిమ బెంగాలు దిఘా ఆలయంలో మూల విరాట్ల తయారీలో వినియోగించిన అంశం పొరపాటున ప్రసారం అయినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. మహరణ (వడ్రంగి) సేవకులతో సంప్రదించిన మేరకు ఈ విషయం స్పష్టం అయింది. వీరి వివరణ ప్రకారం నవ కళేబరం మిగులు వేప కలపతో 2.5 అడుగుల విగ్రహాల తయారీ ఎంత మాత్రం సాధ్యం కాదు. అలాగే పశ్చిమ బెంగాలు దిఘా ఆలయానికి అవసరమైన మూల విరాటుల్ని వేరొక వడ్రంగి ఆధ్వర్యంలో తయారు చేయించి తరలించారు. దీని తయారీలో పూరీ శ్రీ జగన్నాథునికి సంబంధించిన దారు ఏ మాత్రం వినియోగించడం జరగలేదని స్పష్టం చేశారు.
దారు గృహంలో పదిలం
పూరీ శ్రీ జగన్నాథుని మూల విరాటుల తయారీ తర్వాత మిగులు దారు (వేప కలప) భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కేటాయించిన దారు గృహంలో యథాతథంగా పదిలపరచాలని దర్యాప్తు బృందం ఉద్ఘాటించింది. సత్వ లిపి ప్రకారం స్వామి దారు విగ్రహాల మిగులు దారు (వేప కలప) సువార్ మహా సువార్ నియోగుల గృహానికి ఆనుకుని ఉన్న దారు గృహంలో పదిలపరచాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1995– 96 సంవత్సరంలో చోటు చేసుకున్న పొరబాటు కారణంగా తాజా వివాదం తీవ్ర కలకలం రేపిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మిగులు కలపలో కొంత భాగం దైతపతి నియోగుల గృహంలో ఉంచేందుకు అనుమతించారు. దీని ఆధారంగా శ్రీ మందిరం మిగులు వేప కలప దుర్వినియోగం అయిందనే ఆరోపణ తీవ్ర దుమారం రేపింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా సత్వ లిపి ప్రకారం మిగులు వేప కలప దారు గృ హంలో యథాతథంగా పదిల పరచాలని దర్యాప్తు బృందం సిఫారసు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటి పర్యవేక్షణలో మిగిలి ఉన్న వేప కలపని లెక్కించి ఒక చోట పోగు చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతం దారు గృహంలో కొంత, దైతపతి గృహంలో కొంత మిగులు కలప ఉంది. ఈ రెండింటిని ఒక చోట కూడగట్టి కమిటి సభ్యుల సమక్షంలో లెక్కించి దారు గృహంలో భద్రపరచనున్నారు.
నోరు జారి పొరపాటు దొర్లింది
దిఘా ఆలయంలో మూల విరాటుల తయారీకి సంబంధించి నోరు జారి పొరపాటు దొర్లిందని వివాదాల్లో చిక్కుకున్న దైతపతి సేవాయత్ రామకృష్ణ దాస్‌మహాపాత్రొ వివరణ దాఖలు చేశారు. ఈ మేరకు లిఖితపూర్వంగా విచారణ బృందానికి విన్నవించారు.