● ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి
విజయనగరం/నెల్లిమర్ల రూరల్: లైంగికంగా బాల,బాలికలను వేధించినా, అవమాన పరిచినా..నేరం చేసిన వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో బుధవారం ఆమె నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాం గ్రామంలో పోక్సో చట్టంపై న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దగ్గర వారే మన బాలికలపై నేరానికి పాల్పడుతుంటారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్ల లపట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతుంటారని, ఇంటర్‌నెట్ ప్రభావానికి లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని చెప్పారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిణీరావు,, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి.సీతారాం, కొండగుంపాం గ్రామసర్పంచ్ పి.అప్పన్న, నెల్లిమర్ల ఎస్సై ఎం.గణేష్, కొండగుంపాం గ్రామ సచివాలయ కార్యదర్శి ఎల్.తౌడు, సచివాలయ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.


