
పనస కాయల లోడ్ వ్యాన్ బోల్తా : గిరిజన మహిళ మృతి
● రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్‌రోడ్డులో ఘటన
ముంచంగిపుట్టు (అల్లూరి జిల్లా): మండలంలో రంగబయలు పంచాయతీ కోసంపుట్టు గ్రామ సమీపంలో గల ఘాట్‌రోడ్డులో పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూరు బ్లాక్ తుభ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కిల్లో కుమ్మి(42) మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఆదివారం రంగబయలు పంచాయతీ కోసంపుట్టు, పట్నపడాల్‌పుట్టు, జోడిగుమ్మ గ్రామాల్లో పసనకాయలను కొనుగోలు చేసి, వ్యాన్‌లో లోడు చేసుకొని వస్తుండగా కోసంపుట్టు ఘాట్‌రోడ్డు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక ఉన్న కిల్లో కుమ్మి అనే మహిళ కింద పడిపోయింది.ఆమె మీద వ్యాన్ బోల్తా పడింది. వాహనం కింద నలిగిపోయి మహిళ మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్,పనసకాయల కొనుగోలుదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వ్యాన్ కింద నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. స్థానిక ఎంపీటీసీ సిరగం భాగ్యవతి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి,వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వాహనం ఎక్కడిది,పనసకాయల కొనుగోలుదారులు ఎక్కడివారు అనేది తెలియాల్సి ఉంది.గత రెండు నెలల వ్యవధిలో కోసంపుట్టు ఘాట్‌రోడ్డులో మూడు సార్లు వాహనాలు బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు.ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

పనస కాయల లోడ్ వ్యాన్ బోల్తా : గిరిజన మహిళ మృతి