భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో మహాస్నానం సేవ శనివారం నిర్వహించారు. సేవల నిర్వహణ సమయంలో పాణియా అపొటొ గాయపడ్డాడు. నీళ్లు మోస్తుండగా మందిరం లోపలి గడప ప్రాంగణంలో సేవాయత్ కృష్ణచంద్ర అపొటొ జారి పడడంతో గాయపడి రక్తస్రావమైంది. దీంతో శ్రీమందిరం ఆచారం ప్రకారం మూల విరాటులకు మహాస్నానం చేయించారు. ఈ సేవ ముగిసే వరకు దీర్ఘకాలం సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. బాల భోగం నివేదన సేవకు అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రాంగణం శుద్ధి తదితర అనుబంధ కార్యకలాపాలతో భక్తులకు దర్శనం, స్వామి సేవలకు అంతరాయం అనివార్యమైనట్లు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొన్నాయి. తక్షణ చికిత్స కోసం బాధిత కృష్ణచంద్ర అపొటొని స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.