పార్వతీపురంటౌన్: ఈ నెల 25న పాలకొండలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఎనీ డిగ్రీ చదివి 18 నిండి 29 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతి, యువకులు జాబ్‌మేళాకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీ సత్య సాయి డిగ్రీ కాలేజీ, పాలకొండలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు 15 కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీల్లోకి ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులకు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్//నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్‌తో పాటు రెస్యూమె, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్,1 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో జాబ్‌మేళా జరిగే ప్రదేశంలో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 6301275511, 7993795796 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటి (55) పాముకాటుతో శుక్రవారం మృతిచెందాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యంలో నాగుపాము కాటువేసింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసి, రావాడ రామభద్రపురం పీహెచ్‌సీలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో పార్వతీపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటి మృతిచెందాడు. అయినప్పటికీ కుటుంబసభ్యులు సమీపంలోని చినమేరంగి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా వెంకటి మృతిచెందినట్లు అక్కడి వైద్యురాలు పూర్ణ చంద్రిక ధ్రువీకరించారు.