
No Headline
జయపురం: లమతాపుట్ జలాశయంలో గురువారం ఒక నాటు పడవ బోల్తాపడడంతో వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి బిలాపుట్ పంచాయతీ జబాగుడ గ్రామానికి చెందిన సుకు ప్రధాన్(39)గా గుర్తించారు. అతడు గురువారం మధ్యాహ్నం తన జీడిమామిడి తోటకు బయల్దేరాడు. తోటకు వెళ్లేందుకు మధ్యలో లమతాపుట్ జలాశయం ఉండడంతో నాటు పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. జలాశయ పరివాహక ప్రాంతంలో వేరుశనగ పంట పొలంలో పనిచేస్తున్న రైతులు పడవ మునిగిపోవడం చూశారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వారు స్థానిక సర్పంచ్ రాజు లెద్రకు తెలియజేయగా ఆయన జోళాపుట్ పోలీసులకు సమాచారం అందించారు. జోళాపుట్ ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ పొరిడ, లమతాపుట్ ఎస్‌ఐ గోవింద హన్సద, నందపూర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా జాడ తెలియకపోవడంతో తిరిగి శుక్రవారం ఉదయం నుంచి గాలిస్తున్నారు. ఈ ఘటనతో సమీప ప్రాంతాల్లో విషాదం నెలకొంది.