అధికారులకు కేంద్ర మంత్రి
శ్రీనివాసవర్మ ఆదేశం
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను దసరా ఉత్సవాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఎయిర్‌పోర్ట్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు వివరించారు. అనంతరం శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సవరించిన అంచనాల ప్రకారం రూ.824.28 కోట్ల వ్యయంతో ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంతో అత్యాధునిక సదుపాయాలతో టెర్మినల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 51,315 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మిస్తున్న టెర్మినల్‌లో 24 చెక్ – ఇన్ కౌంటర్లు, 8 కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఆరు ఏరో బ్రిడ్జ్‌లు, 9 డిపార్చర్ గేట్లు, పది ఎస్కలేటర్లు, 19 ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తే షార్జా, సింగపూర్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ అధికారులు ఉన్నారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై నిష్పాక్షక దర్యాప్తు చేయాలి
గూడూరు: గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఏపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాఽథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాయికృష్ణ తల్లి, మేనమామ చేస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న వాస్తవాలను త్వరితగతంగా వెలికితీయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసులో వస్తున్న ఆరోపణలపై వేగవంతంగా విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. అవసరమైతే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్‌యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్‌కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ. వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.
గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి
గుడివాడరూరల్: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు ఎస్.సమరం, సీహెచ్ వెంకటేశ్వరరావు జిల్లా గురుకుల పాఠశాలల డీసీవో మురళీకృష్ణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని, విద్యార్థులకు ఆట స్థలాలు కేటాయించాలని కోరారు. తాగునీటి సౌకర్యం, బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, విస్సన్నపేట, నందిగామ, తిరువూరు గురుకుల పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందన్నారు. రుద్రవరంలోని డాక్టర్ గురుకుల పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, మోటూరు గురుకుల పాఠశాలలో తాగునీటి బోర్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోందన్నారు.


