రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న గురుదేవ్ మహాపాత్రో(23)సంఘటన స్థలంలోనే మృతి చెందిన సంఘటన గురువారం విస్సన్నపేట– నూజివీడు రోడ్డులో జరిగింది. మృతుడు విస్సన్నపేటలో ఒక కార్ల షోరూమ్‌లో స్పేర్‌పార్ట్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలసి కొండపర్వలో నివాసం ఉంటున్న గురుదేవ్ మహాపాత్రో ఉదయం విధులకు హాజరయ్యేందుకు స్కూటర్‌పై ఇంటి నుంచి విస్సన్నపేట వస్తుండగా మలుపు వద్ద లారీ వెనుక భాగం తగిలి తలకు బలమైన గాయం అయి తీవ్ర రక్తస్రావం జరగటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న మృతుడి హెల్మెట్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. వెనుకనే వస్తున్న డీసీఎం వ్యాను, దాని వెనుక వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. స్కూల్ బస్‌లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు.
న్యాయం చేయండి..
మృతుడు తల్లి మధుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. కాగా వీరి స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా మల్లూ గ్రామం, అయితే కొండపర్వ గ్రామం వద్ద ఉన్న ఫ్యానుల కంపెనీలో వైడింగ్ పని మేసీ్త్రగా తన భర్త సురేష్ మహాపాత్రో పనిచేస్తుండటంతో కుటుంబం కొండపర్వ గ్రామంలో నివాసం ఉంటున్నామని మృతుడి తల్లి మధుస్మిత పేర్కొన్నారు. డ్యూటీకి వస్తున్న క్రమంలో తన కుమారుడు ఈ విధంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, మృతికి కారణమైనవారిని పట్టుకొని తమకు తగున్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన కుమారుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


