దళారులకే సం‘పత్తి’! | - | Sakshi
Sakshi News home page

దళారులకే సం‘పత్తి’!

Dec 20 2025 9:16 AM | Updated on Dec 20 2025 9:16 AM

దళారులకే సం‘పత్తి’!

దళారులకే సం‘పత్తి’!

రైతులకు సీసీఐ శఠగోపం!

కేజీ పత్తినీ కొనుగోలు చేయని సీసీఐ కేంద్రాలు పేరుకే ఆరు కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ మంత్రికి విన్నవించుకున్నా ఫలితం శూన్యం

కంచికచర్ల: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం.. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అధికారుల నిర్వాకంతో పత్తి రైతులు దళారీల చేతుల్లో నలిగిపోతున్నారు. సీసీఐ పంట కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టినా.. చివరికి దళారీలదే పెత్తనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సీసీఐ కూడా దళారీలకే మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆర్భాటంగా ప్రారంభం..

ఎన్టీఆర్‌ జిల్లాలో రైతులు 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కారు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ను సంప్రదించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆర్భాటంగా ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు కూడా దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని రైతులకు చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ. 7,710 నుంచి రూ.8,110గా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

సీసీఐ, దళారుల మిలాకత్‌!

కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేక పోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు.

కాలయాపన చేస్తూ రైతులను అసహానికి గురిచేస్తూ దళారులను రైతులు ఆశ్రయించేలా చేస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు మాత్రం ట్రాన్స్‌పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ.4,500 లోపు కొంటున్నారు.

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినా..

తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కంచికచర్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడిని ఇటీవల కలిశారు. కానీ నేటికీ రైతుల నుంచి ప్రభుత్వం కాని, సీసీఐ అధికారులు కాని కొనుగోలు చేయలేదని రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement