ఆత్మస్తుతి.. పరనింద!
గంటన్నర ఆలస్యంగా వచ్చిన మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిధుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చైర్ పర్సన్ హారిక
నిందలు మోపుతున్నారు: జెడ్పీ చైర్‌పర్సన్
మొక్కుబడిగా డీఆర్‌సీ సమావేశం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సమీక్ష సమావేశం మొక్కుబడిగా సాగింది. గంటా నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా జరగాల్సిన విధంగా జరగలేదు.. తూతూ మంత్రంగానే సాగింది. అంతా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా సాగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను సైతం గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. తాము చేసేదే గొప్ప అన్నట్లుగా సమావేశం నడిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటలకు హాజరు కావాల్సిన మంత్రి వాసంశెట్టి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి 3.40 గంటలకు వచ్చారు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే(జనసేన) మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహిస్తే పరిపూర్ణంగా నిర్వహించాలని.. లేకుంటే మరో రోజుకు వాయిదా వేయాలని, ఇలా చేస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.
మిల్లర్ల జోక్యాన్ని నివారించండి..
అనంతరం వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చ ప్రారంభంకావటంతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. రాబోయే వేసవి కాలం నాటికి ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని దీని ద్వారా ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు రూ. 8కోట్ల నిధులు జిల్లా పరిషత్‌కు కేటాయించారని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆర్డర్లు తమకు వచ్చాయని కృష్ణాజిల్లాకు సంబంధించి ఆర్డర్లు రాలేదని వివరించారు. అయినప్పటికీ కృష్ణాజిల్లాకు సంబంధించిన నిధులను బట్టి కేటాయించిన పనులకు సంబంధించిన ఫైలు తాము తిరస్కరించామని పత్రికల్లో సీఈవో కన్నమనాయుడు తనపై వార్తలు రాయిస్తున్నారని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనను బట్టి కలెక్టర్ ఇచ్చిన హామీని కూడా లెక్క చేయకుండా మరలా 205 పనులు రద్దు చేస్తూ తనకు లేఖ రాశారని చెప్పారు. పనులు ప్రారంభమైనవి కూడా ప్రారంభం కాన్నట్లుగా చూపుతున్నారని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు.
ఆత్మస్తుతి.. పరనింద!


