చల్లపల్లిలో కారు బీభత్సం
జనంపైకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
చల్లపల్లి: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి..
కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది.
పెనమలూరు: మహిళకు కారు నేర్పుతున్న వ్యక్తిని అదే కారు ఢీ కొట్టడంతో మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకరమణ తెలిపిన వివరాల ప్రకారం నిడమానూరుకు చెందిన పాతూరు సుబ్బారావు(62) అదే గ్రామానికి చెందిన తోటకూర కవితకు ఆదివారం నారాయణపురం కాలనీ వద్ద కారు డ్రైవింగ్ నేర్పించసాగాడు. అతను కారు దిగి కారు ఎలా నడపాలో ఆమెకు వివరిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కారు వేగంగా నడిపి రోడ్డుపై ఉన్న సుబ్బారావును ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. చికిత్స పొందుతున్న సుబ్బారావు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్, లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు.
మూడేళ్ల బాబుతో పరారీ..
అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్‌కే నబీ తెలిపారు.
చల్లపల్లిలో కారు బీభత్సం


