కరాటే పోటీల్లో తాత – మనవళ్ల్లకు పతకాలు
పెనమలూరు: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో యనమలకుదురుకు చెందిన తాత–మనవళ్లు ఉత్తమ ప్రతిభచాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఆదివారం ఐదో జాతీయ కుంగ్‌ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న యనమలకుదురుకు చెందిన ఎస్.దుర్గారావు(64) సీనియర్ సిటిజన్ కాటా విభాగంలో బంగారు పతకం, గ్రాండ్ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. అతని మనవళ్లు ఎస్.సాత్విక్ (9), ఎస్.రిత్విక్ (7) వెపన్ కాటా విభాగంలో బంగారు పతకాలు సాధించారు. అలాగే జి.నినా 7 సంవత్సరాల లోపు కాటా, వెపన్స్ కాటా విభాగాల్లో రెండు బంగారు పతకాలు గెలిచింది.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మొగల్రాజపురం కొండపైన భాలభాస్కర నగర్‌కు చెందిన తుమ్మల కృష్ణ(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి బోయపాటి మాధవరావు రోడ్డులోని మురుగునీటి కాలువలో పడి మృతి చెందాడు. స్థానిక వైన్‌షాప్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలో ఆదివారం అర్ధరాత్రి పడిపోయి మృతి చెందిన కృష్ణను సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని బాలభాస్కర నగర్‌లోని ఇంటికి తీసుకువెళ్లారు. మాచవరం పోలీసులు వచ్చి మృతుడి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు.
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్‌లో జాతీయ ఇంధన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను సంస్థ చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులు సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జరిగే ఇంధన వారోత్సవాల్లో ఇంధన పొదుపు, ఇంధన ప్రాధాన్యతపై ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. శక్తి వృథాను తగ్గించడం, వనరులు కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక పునర్నిర్మాణ రంగం ఇంధన రంగంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదాతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. వారోత్సవాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నగేష్‌బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్‌బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్‌బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరిన నగేష్‌బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
విశాఖ సిటీ: నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్‌బీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్‌ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్‌లో మొత్తం రూ.32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు.
కరాటే పోటీల్లో తాత – మనవళ్ల్లకు పతకాలు


