మహోద్యమంగా ఇంధన పొదుపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన పొదుపును మహోద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సమష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర – 2047 దిశగా అడుగులు వేద్దామన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు–2025 (డిసెంబర్ 14–20)లో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్టేడియంలో ఇంధన పొదుపుపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, కలెక్టర్ లక్ష్మీశ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీపీడీసీఎల్.. బీఈఈ సౌజన్యంతో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులతో కలిసి జాతీయ ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృథా కాకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తానని.. విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానంటూ ప్రతిజ్ఞ చేయించారు. జెన్‌కో ఎండీ నాగలక్ష్మి మాట్లాడుతూ... ప్రతి వ్యక్తీ, సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని.. భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటికే 1,400 వరకు వాణిజ్య భవంతులు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు.
ప్రతి ఇల్లూ సూర్యఘర్ కావాలి..
ఇంధనాన్ని వృథా చేస్తే డబ్బును వృథా చేసినట్లేనని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ – సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ మాట్లాడుతూ ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ఒక యూనిట్‌ను ఆదా చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేసేనట్లేనని పేర్కొన్నారు. నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు.. మాట్లాడుతూ విద్యుత్ పరిరక్షణలో ఏపీ నంబర్ 1గా ఉంటోందని, మిషన్ మోడ్‌లో విద్యుత్ పొదుపు కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీలు, సమావేశాలు తదితరాలతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలతో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


