పిల్లలతో నదిలో దూకేందుకు యత్నం.. రక్షించిన ట్రాఫిక్ పో
కృష్ణలంక(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణానదిలోకి దూకేందుకు యత్నించిన తల్లీ పిల్లలను ఐదో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. ఈ ఘటన కృష్ణలంక ప్రాంతంలోని వారధిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు భవానీపురానికి చెందిన ప్రమీల అనే మహిళకు 5, 6 సంవత్సరాలు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఏ పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతుండడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపానికి గురై బాధపడుతుండేది. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణానదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుని సోమవారం మధ్యాహ్నం వారధి పరిసరాలకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే వారధిపై 45వ పిల్లర్ వద్ద పిల్లలతో కలిసి ఆమె కృష్ణానదిలో దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో వారధిపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ ఆమెను గమనించాడు. వెంటనే అప్రమత్తమై హుటాహుటినా ఆమె వద్దకు చేరుకుని వారిని రక్షించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి భవానీపురం పోలీసులకు అప్పగించారు.


