ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
పరస్పర విమర్శలతో భగ్గుమంటున్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే కొలికపూడి ప్రతిపక్షాలతో అంటకాగుతున్నారని ఎంపీ పరోక్ష వ్యాఖ్యలు ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారన్న ఎమ్మెల్యే
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరస్పర ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. నాయకుల అవినీతిపై మాటల మంటలు మండుతున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ చిన్ని చేసిన ఆరోపణల నేపథ్యంలో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా ఎంపీ కనుసన్నల్లోనే నడుస్తోం దని, నామినేటెడ్ పోస్టులను సైతం ఎంపీ కార్యాలయ సిబ్బంది అమ్ముకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో తలదూరు స్తున్న ఎంపీ వ్యవహారంపై అధిష్టానం ఎదుట తేల్చుకుంటానని, ఈ నెల 24న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ చిన్ని వావిలాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొలికపూడిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను నిఖార్‌సైన టీడీపీ కార్యకర్తనని, ప్రతిపక్ష పార్టీలతో అంటకాగే రకాన్ని కాదని ఎంపీ అన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ను విమర్శించే నాయకుల అంతు చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. నాలుగేళ్లుగా తాను నియోజకవర్గంలో సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాను డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నట్టు ఆరోపిస్తున్న వ్యక్తుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు.
టీడీపీలో కోవర్టులున్నారు
టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్‌లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ, నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.
కాగా.. ఎంపీ చిన్ని తిరువూరు పర్యటనలో తనపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కొలికపూడి దీటైన సమాధానం ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యేను విభేదించే నాయకులు ఎంపీ పర్యటనలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..


